Rahul Gandhi: ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. మూాడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారత్ జోడోయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ఆదోనిలో రాహుల్ గాంధీ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చాం.. ఆ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా కూడా ఇచ్చిన హామీల్లో ఉంది. గతంలో జరిగిన విభజన కాకుండా భవిష్యత్ పై దృష్టి పెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. అందులో రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉందన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయాల్సి ఉందని .. తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. భారత్ జోడో యాత్రకు ఏపీలో అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. తమకు అందుతున్న మద్దతు తమ నాయకుల అంచనాలకు మించి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణానికి ఇది శుభారంభం అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొత్తులపై అడిగిన ప్రశ్నలపై ఆ నిర్ణయం తన పరిధిలో కాదని రాహుల్ గాంధీచెప్పారు. రేపు అవసరమైతే కేంద్రంలో వైసీపీ మద్దతు తీసుకుంటారా? అనే ప్రశ్నపై స్పందించిన రాహుల్ వాటిపై కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
బీజేపీ, వైసీపీ, టీడీపీలలో అసమ్మతిని సహించరని . కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తుందని.. తమది ఓపెన్ మైండెడ్ పార్టీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని మీడియాను ప్రశ్నించారు. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల అంతర్గత ఎన్నికలపై ఎవరూ ఎందుకు ఆసక్తి చూపరని అడిగారు. భారతదేశంలో ద్వేషం, హింస వ్యాప్తి చెందుతోందని, భారతదేశం విభజించబడుతుందని తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. తాము దీనికి వ్యతిరేకమని పేర్కొన్న రాహుల్ గాంధీ భారతదేశాన్ని అనుసంధానం చేయడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర సాగుతుందని తెలిపారు.