Alleti Maheswara Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ చుగ్‌ను మహేశ్వర్ రెడ్డి కలిశారు. అనంతరం జేపీ నడ్డాతో సమావేశమైన మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరటాన్ని స్వాగతిస్తున్నామని తరుణ్ చుగ్ తెలిపారు. కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలను, దేశాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్న ప్రధాని మోదీపై విశ్వాసంతో బీజేపీలో చేరుతున్నానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
మహేశ్వర రెడ్డికి షోకాజ్ నోటీసులు..(Alleti Maheswara Reddy)
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ బుధవారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మహేశ్వర రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గంటలోపు సమాధానం చెప్పాలని కోరింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం క్రమశిక్షణా కమిటీకి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాను నేరుగా ఖర్గే తోనే తేల్చుకుంటానని స్పష్టం చేసారు. ఇలా ఉండగా మహేశ్వర రెడ్డి గత కొద్దికాలంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్నారు. బయటనుంచి వచ్చివారు పెత్తనం చేస్తున్నారంటూ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా ..
ఏలేటి మహేశ్వర్ రెడ్డి2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున నిర్మల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తరువాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనంతరం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో 9271 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2021లో తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.