Yuvagalam: తెలుగుదేశం పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నిన్న జరిగిన చంద్రబాబు, పవన్ భేటీలో విజయోత్సవ సభకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుండటంతో ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురంలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు.
70 బహిరంగ సభలు..(Yuvagalam)
ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అదే రోజు సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ-జనసేన పూరించనున్నాయి. అలాగే సభలో రెండు పార్టీలు కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు భారీగా జనసేన, టీడీపీ శ్రేణులు హాజరుకానున్నారు. వారి కోసం 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 7 న నారా లోకేష్ చిత్తూరు జిల్లా కప్పం నుంచి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర నేటితో 226 వ రోజుకు చేరుకుంది.నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర సందర్బంగా 70 బహిరంగ సభల్లో లోకేష్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో 79 రోజుల పాటు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.