Site icon Prime9

CM KCR Speech: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ పిట్టకథ.. భలే ఉందిగా!

diwali wishes from cm KCR

diwali wishes from cm KCR

CM KCR Speech: ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుకు ముందు.. కేసీఆర్ ప్రసంగించారు. ఈ సారి బడ్జెట్ సమావేశాలు.. 52 గంటలపాటు సాగాయి. ఈ సందర్భంగా కేంద్రంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పై సీఎం ఘాటు విమర్శలు చేశారు. దేశంలో అప్పులు చేయడంలో.. మోదీని మించిన ఘనుడు లేడని ఆయన అన్నారు.

 

మోదీపై కేసీఆర్ పిట్టకథ..(CM KCR Speech)

దేశ ఆర్థిక దుస్థితి గురించి మాట్లాడిన కేసీఆర్.. ఓ పిట్టకథ వినిపించారు. తిరుమల రాయుడనే ఓ రాజు ఉండేవాడు. దురదృష్టవశాత్తూ అతడికి ఒకటే కన్ను. ఈ విషయంలో ఆ రాజు ఎప్పుడు బాధపడుతు ఉండేవాడు. అదే రాజ్యంలో ఒక కవి కూడా ఉండేవాడు. ఆ కవికి ఏవో సమస్యలు. రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయన్ని పొగడాలని సలహా ఇస్తారు. కవికి ఎలాగో అవసరం ఉంది కాబట్టి ఇష్టం లేకపోయినా ‘అన్నాతిగూడి హరుడవు.. అన్నాతిని గూడనపుడు అసుర గురుండవు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెబుతాడు.

ఈ కవిత్వానికి కేసీఆర్ వివరణ ఇస్తూ.. భార్యతో ఉన్నప్పుడు మూడు కళ్ల శివుడవు. అంటే భార్య రెండు కళ్లతో కలిపి మూడు కళ్లు కలిగినవాడని అర్థం. భార్యతో లేనప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి. శుక్రాచార్యుడికి ఒంటి కన్నుమాత్రమే ఉంటుంది. ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా కౌరవపతి. అంటే ధృతరాష్ట్రుడంతటి వాడివని అర్ధం అని పొగుడుతాడు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఇదే జరుగుతుంది. మోదీని ఉద్దేశించి ఇలాగే పొగుడుతున్నారు. అభివృద్ధి చేయాలని చెప్పకుండా బాగుంది.. బాగుంది అని అంటున్నారు. మోదీ మాజీ ప్రధాని అయిన తర్వాత అసలు సంగతి చెబుతారు అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి.

 

కూల్చివేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు..

నూతన సచివాలయం.. ప్రగతిభవన్‌పై విపక్ష నేతల వ్యాఖ్యలకు కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. అలాంటి వాటిని కూల్చివేస్తే ఊరుకుంటామా అని కేసీఆర్ అన్నారు. అలా చేస్తే.. ప్రజలే కాళ్లు, రెక్కలు విరిచి పడేస్తారని హెచ్చరించారు. ఇలాంటి తమాషాలను తెలంగాణ ప్రజలు ఉపేక్షించరని కేసీఆర్ అన్నారు. ఇదే సభలో ఈటల రాజేందర్ పై కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. సమయం దొరికితే ప్రభుత్వంను బద్నా చేయాలని ఈటల ప్రయత్నిస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఈటలకు తెలుసని.. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అన్ని మర్చిపోతారా అని సీఎం ప్రశ్నించారు.

దేశం ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. విశ్వ గురువుని ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ జనగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రపంచ యుద్ధాలు జరిగిన ఈ జనగణన ఆపలేదని.. అలాంటింది భాజపా ప్రభుత్వం ఎందుకు జనగణన చేపట్టడంలేదని అన్నారు. కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని ఆరోపించారు. భాజపా గోరంతలు గల విషయాన్ని గొప్పగా చెప్పుకుంటే.. కాంగ్రెస్ వాళ్లు చేసిన పనిని చెప్పుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పారు కేసీఆర్. ఎన్డీఏ అంటే నో డేటా అవెలబుల్‌ అని చమత్కరించారు.

Exit mobile version