Chegondi Hariramazogaiah:స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో చంద్రబాబు అతిపెద్ద స్కాంకు పాల్పడ్డారని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ఆరోపణలపై కాపుసంక్షేమసేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
స్కాంలో చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని.. లేనిపక్షంలో జనసేన టిడిపితో కలిసే అవకాశాలు ఉండవన్నారు. ఈ ఆరోపణలు నిరూపణ అయితే నీతివంతమైన పరిపాలన అందిస్తామన్న పవన్ కళ్యాణ్‌పై ప్రజల ఆశలు అడియాశలవుతాయని జోగయ్య అన్నారు . ఒకవేళ స్కాం నిజమైతే టిడిపిని పక్కనబెట్టి ప్రయాణం చేయడం తప్ప జనసేనకు వేరే మార్గం లేదని చేగొండి హరిరామమ జోగయ్య జోస్యం చెప్పారు.వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపిని ఓడించేందుకు టిడిపి నాలుగు మెట్లు దిగివచ్చి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. తాజా రాజకీయాలపై జోగయ్య విశ్లేషణ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభకి స్వచ్ఛందంగా హాజరైన జనాన్ని చూస్తే వైఎస్‌ఆర్‌సిపిపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఎంతన్నది తేటతెల్లమవుతోందని జోగయ్య వివరించారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలతో కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చెప్పకనే చెబుతోందని జోగయ్య లేఖలో తెలిపారు. అయితే తెలుగుదేశంపై ప్రజల్లో ఉన్న అభిమానం అని కలలు కనవద్దని జోగయ్య హితవు పలికారు. జనసేన కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరే రకంగా ఉండేవని జోగయ్య విశ్లేషించారు.
జనసేన పోటీ చేయకుండా టిడిపితో కలిసి ప్రయాణం చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని గ్రహిస్తే మంచిదని జోగయ్య సూచించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనని కలుపుకుని ప్రయాణం చేయవలసి వస్తే తెలుగు దేశం పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా నాలుగు మెట్లు కిందికి దిగాలని జోగయ్య అన్నారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూడాలన్న జనసైనికుల కోరికకి ఎటువంటి భంగం కలగకుండా టిడిపి ప్రణాళికలు రచించి అమలు చేయాలని జోగయ్య చెప్పారు. ఇలా చేస్తేనే వైఎస్‌ఆర్‌సిపిని ఓడించడం సాధ్యమవుతుందని జోగయ్య అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఏర్పాటు చేయడంతోపాటు ఏపీ భవిష్యత్ తీర్చిదిద్దవచ్చని జోగయ్య సూచించారు.
మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటను జనసేన నాయకుల బృందం పర్యటించి పరిశీలించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. పంట నష్టంపై అధికార యంత్రాంగం ఇప్పటివరకు తమ వద్దకు రాలేదని ముచ్చువోలు గ్రామస్థులు వాపోయారు. పార్టీ ఆదేశానుసారం వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నివేదిక సమర్పించనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.