YS Sharmila Comments: వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి సీఎం జగనే కారణమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దీనికి తన అమ్మ విజయమ్మ, ఆ దేవుడే సాక్ష్యమని చెప్పారు. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్దాయి విస్తృత స్దాయి సమావేశంలో వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
జగన్ కోసం రాజీనామా చేసిన 18 మంది ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించడానికి తాను, తన తల్లి విజయలక్ష్మి రాష్ట్రమంతా పర్యటించామని చెప్పారు. జగన్ కోసం నెలల తరబడి 3వేల,200 కిలో మీటర్ల పాదయాత్ర చేశానని చెప్పారు.నెలల తరబడి కుటుంబాన్ని వదిలి రోడ్లపైనే తిరిగాను. తరువాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేసాను. తరువాత తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసాను. వారికి ఎప్పడు కావాలంటే అది చేసాను. స్వలాభం చూసుకోకుండా మీ కోసమే ఏది అడిగితే అది చేసాను. గత ఎన్నికల ముందు బైబై బాబు క్యాంపెయిన్ చేసాను. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరవాత మనిషే మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు, పేరు నిలబడితే చాలనుకున్నాను. ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జగన్ పార్టీ మొత్తం బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్టని షర్మిల అన్నారు. వైఎస్ సీఎం అయిన ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని చెప్పారు. రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారని అన్నారు. వైఎస్ మరణం తరువాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగలా మారిందని, వైఎస్ పధకాలు అమలు కావడం లేదని షర్మిల ఆరోపించారు.