Janasena chief Pawan Kalyan: కులం పేరు పెట్టుకున్న వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదు. 30 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు. క్లాస్ వార్ గురించి ఉచ్చరించే అర్హత లేదంటూ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం భీమవరం అంబేద్కర్ సెంటర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 50 వేలమంది కార్మికుల కడుపుకొట్టి మూడు కంపెనీలకు ఇసుక కాంట్రాక్టు కట్డబెట్టిన ముఖ్యమంత్రికి సిగ్గుండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మభ్యపెట్టారు. మొక్కుబడిగా ఐదువేల రూపాయల జీతంతో వాలంటీర్లుగా నియమించి పీజీలు చేసిన వారితో కూడా నామమాత్రపు పనులు చేయిస్తున్నారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలు జరగడం లేదు. అంబేద్కర్ విదేశీవిద్య పధకం పేరు మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. డబ్బులు మనందరివీ సోకులు ఈ పెద్దమనిషివి అంటూ విరుచుకు పడ్డారు. సరైన రాజకీయ వ్యవస్దలేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా విదేశాలకు వెళ్లిపోతుందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే నియోజక వర్గానికి 500 మంది యువకులకు పది లక్షల చొప్పున స్వయం ఉపాధికి ఆర్దిక సాయం అందజేస్తామని తెలిపారు. మద్యపానం పై లక్ష కోట్లు ఆర్జించి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసారు. మీ ఆరోగ్యాలను చిద్రం చేసి,మహిళల పుస్తెల తాడులను తెంపుతున్నాడంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కష్టం. జనసేన అధికారంలోకి వస్తే పాత ధరలకు మద్యం అమ్ముతాం. మద్యానికి సంబంధించి ఆడపడుచులు మా ప్రాంతంలో కాని కాలనీల్లో కాని మద్యం ఉండకూడదంటే అక్కడ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని స్పష్టం చేసారు.
గూండా, దోపిడీ వ్యవస్దకు ఎదురొడ్డి పోరాటం.. (Janasena chief Pawan Kalyan)
రైతులకు గిట్టుబాటు ధర లేదు. పవన్ కళ్యాణ్ వస్తే తప్ప రైతుల అక్కౌంట్లో డబ్బులు పడవు. రైతు భరోసా కేంద్రాల్లో ఏమీ వుండవు. అన్ని పదవులు ఒకే సామాజిక వర్డానికే కట్టబడితే అది క్లాస్ వార్ అవుతుందా? ఒక్క కులమే అన్నీ మాకే అంటే కుదరదు. అది రాజ్యాంగ విరుద్దం. కోనసీమ రైతాంగం క్రాప్ హాలీడే అని చెబుతున్నారు. కాలవల్లో పూడికలు తీయరు. కరెంటు చార్జీలు ఎనిమిది సార్లు పెంచారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. ఆక్వా ఫీడ్ రేటు పెరిగిపోయింది. పట్టు రైతులను వదిలేసాడు. భీమవరం డంపింగ్ యార్డు కు నేను వెళ్లాను.స్దానిక నాయకులు ఎప్పుడైనా వెళ్లారా? ప్రభుత్వ ఆసుపత్రులను చంపేస్తున్నారు. నాబార్డ్ నుంచి పదికోట్ల రూపాయలు మంజూరు అయినా భీమవరం ఆసుపత్రి అభివృద్ది జరగలేదు. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయలేకపోయారు. భీమవరం పట్టణానికి రెండు ఫ్లై ఓవర్లను కూడా నిర్మించలేకపోయారని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దశాబ్దకాలంగా ప్రజాస్వామ్య తరహాలో పోరాటం చేస్తున్నాము. భీమవరంలో నేను ఓడిపోయానని ఎప్పుడూ అనుకోలేదు. మనకు ఓటమి, గెలుపు ఉండవు. ప్రయాణమే ఉంటుంది. ప్రజాస్వామ్యం కోసం, భద్రతకోసం పోరాటం.దేనికయినా పోరాటం చేయక తప్పదు. సీఎం హెలికాఫ్టర్ లో వెడితే పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. చెట్లు కూడా మౌనపోరాటం చేస్తున్నాయి. ఇష్టానికి చట్టాలు చేస్తూ వ్యవస్దను నడుపుతుంటే అది కుళ్లిపోయిందని అర్దం. ఈ గూండా, దోపిడీ వ్యవస్దకు ఎదురొడ్డి పోరాడుతున్నామని పవన్ అన్నారు.
నీ పర్సనల్ లైఫ్ మొత్తం నాకు తెలుసు..
ముఖ్యమంత్రికి ఒక్కటే చెప్పదలుచుకున్నా. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. మీరు హైదరాబాద్ లో ఏమేం చేసారో నాకు తెలుసు మీ మంత్రుల చిట్టా నేను విప్పగలను. వ్యక్తిగత విషయాలు గురించి మాట్టాడను. నీ పర్సనల్ జీవితం గురించి మొత్తం నాకు తెలుసు.నేను చెబితే మీ చెవుల్లో నుంచి రక్తం వస్తుంది. ఫాక్షన్ బ్యాగ్ గ్రౌండ్ అని ఎగిరి ఎగిరి పడుతున్నారు. నేను రాజకీయంగా ఏమీ ఆశించి రాలేదు. ప్రతీ వైసీపీ నాయకుడికి హెచ్చరిక అనుకోండి లేదా విన్నపం అనుకోండి మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి.యుక్తవయసులోనే ఎస్సై ప్రకాష్ బాబు ను పోలీస్ స్టేషన్లో కొట్టిన వ్యక్తి ఎంపీ రఘురామరాజును కొట్టించడంలోఆశ్చర్యంలేదు.గాంధీ గారు సత్యశోధన అనే పుస్తకం రాస్తే వైఎస్ జగన్ గారు అసత్యశోధన అనే పుస్తకం రాస్తారు.గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా మార్చేసాడు. నిండా మునిగినోడికి చలేమిటి? పోరాడితే పోయిందేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. గోదావరి జిల్లాల్లో తేల్చుకుందాము. ప్రజల సమస్యలపై పోరాడితే జనసేన నాయకులపై కేసులు పెట్టారు. 25 సంవత్సరాలు మీకు కూలీగా పనిచేయడానికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తారని భావిస్తున్నాను. జనసేన జెండా ఎగరాలి. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం రావాలి. దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి. అగ్రకులాల్లోని పేదలకు పెట్టుబడి కల్పించే సౌకర్యాన్ని జనసేన తీసుకుంటుంది. మీ నోటికి సైలెన్సర్ లు బిగించుకుంటే మా జనసైనికులు బైకులకు సైలెన్సర్ లు బిగించుకుంటారని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు స్పస్టం చేసారు.