Ramachandra Yadav: చిత్తూరు జిల్లాలో మరోసారి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అధికార పార్టీ అండదండలతో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌పై దాడికి తెగబడ్డారు. ప్రచార రథానికి నిప్పు పెట్టారు. సదుం పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ ప్రచార వాహనాన్ని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు.
15 వాహనాలు ధ్వంసం(Ramachandra Yadav)
వైసీపీ కార్యకర్తల దాడిలో సుమారు 15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. బీసీవై పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రయాదవ్ డ్రైవర్‌ను వైసీపీ కార్యకర్తలు వెంటాడి కొట్టారు. వైసీపీ శ్రేణుల దాడిపై ఫిర్యాదు చేసేందుకు రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయినా వదలని వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోనూ రామచంద్ర యాదవ్ పై దాడికి ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్‌పై చెప్పులు విసిరారు.బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ఫోన్, ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. ల్యాప్‌టాప్‌లో విలువైన సమాచారం ఉంది. సదుంలో వైసీపీ అరాచకంపై ఈసీకి రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేశారు.మరోవైపు సదుం మండలం చిలకపాటివారిపల్లిలో బీసీవై నేత ఆనందరెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న కారును ధ్వంసం చేశారు. స్కూటీకి నిప్పంటించారు. ప్రాణ భయంతో ఆనంద రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో దాక్కున్నారు. నిన్న మధ్యాహ్నం అదే ఇంటికి రామచంద్రయాదవ్ వెళ్లడంతో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు.
దొరకని 10 మంది బీసీవై కార్యకర్తల ఆచూకీ..
వైసీపీ శ్రేణుల దాడిలో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్‌మెంట్ కోసం వారిని పోలీసులు తీసుకెళ్లారు. అయితే ఆ 10 మంది బీసీవై కార్యకర్తల ఆచూకీ లభించడం లేదు. వారి ఫోన్‌లు స్విచ్చాఫ్ ఉండటంతోకుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర గాయాలైన బీసీవై కార్యకర్తలని ప్రైవేట్ బిల్డింగులో నిర్బంధించాడనికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ గూండాలకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వాళ్లమీద ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులు.. గాయపడిన వాళ్లను వేధించే ప్రయత్నం చేస్తున్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు టీడీపీ సంఘీభావం తెలిపింది. దగ్ధమైన బీసీవై పార్టీ ప్రచార రథాలను పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రామచంద్రయాదవ్‌పై దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.