Janasena chief Pawan Kalyan: చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందన్నారు.
వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు..(Janasena chief Pawan Kalyan)
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదన్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు వైపీపీ వ్యక్తులు రాళ్లదాడులకు పాల్పడటం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసాత్మక ప్రవృత్తిని తెలియజేస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్ళ పల్లె నియోజకవర్గంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కురబలకోట మండలం అంగళ్ళులో టిడిపి వైసిపి కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో టిడిపి జెండాలని వైసీపీ కార్యకర్తలు తగులబెట్టారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య రాళ్ళ దాడి జరిగింది. అంగళ్ళులో చంద్రబాబు వాహనాలపై వైసిపి శ్రేణులు రాళ్ళ దాడికి దిగాయి. టిడిపి కార్యకర్తలతోపాటు చంద్రబాబు సెక్యురిటీ సిబ్బంది సైతం గాయపడ్డారు.
ఇక పుంగనూరులో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాళ్ళు బీరు బాటిళ్ళతో వైసీపీ టిడిపి కార్యకర్తలు పరస్పర దాడులకి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన తెలుగు తమ్ముళ్ళు పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. మరోవైపు విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారణమంటూ ఇవాళ చిత్తూరు జిల్లా బందుకి వైఎస్ఆర్‌సిపి పిలుపునిచ్చింది.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దిగజారి పోయారని అన్నారు. ఈ కేసులో చంద్రబాబునే ఏ1 గా చేర్చాలని పెద్దిరెడ్డి పోలీసులని కోరారు.