YCP Bus Yatra: ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే అక్టోబర్ 26 నుంచి బస్సుయాత్ర చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.
సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. ఇటీవల వైసీపీ నేతలతో చర్చించిన సీఎం జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను వైసీపీ అధిష్టానం ఫిక్స్ చేసింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
బస్సుయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటారు. ప్రభుత్వం గత 52 నెలలుగా అమలు చేసిన సంక్షేమ పథకాలను గురించి వివరించనున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలతో నియోజకవర్గాలన్నీ కవర్ చేయాలని నిర్ణయించారు. మ్యానిఫేస్టోలో 98 శాతం హామీలను అమలు చేసిన విషయాన్ని కూడా ప్రజలకు వారు చెప్పనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుండటంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.