Woman Went to Birth Place: క్రికెట్ బెట్టింగ్ విన్నాం….. రాజకీయాల్లో ఏ నాయకుడు గెలుస్తాడో చేసిన చాలెంజ్ లు విన్నాం. కానీ వినూత్నంగా ఐదేళ్ల క్రితం ఓ ఆడపడుచు చంద్రబాబు గెలుస్తాడని కుటుంబసభ్యులతో చాలెంజ్ చేసింది. కానీ అనూహ్యంగా గత అయిదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవడం, జగన్ సీఎం కావడంతో తన సవాలును ఓడిపోయిన సదరు మహిళ ఐదేళ్లు పుట్టింటికి దూరమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
సాధారణంగా ఎన్నికల సమయంలో నేతలు గెలుస్తారని, ఓడిపోతారని పందెం కడుతుంటారు. కొందరు పందెంలో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటుంటారు. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత ఏపీ ఎన్నికలపై కాసిన పందెం తన పుట్టింటికి ఐదేళ్లపాటు వెళ్లకుండా ఆపింది. తాజాగా ఐదేళ్ల తరువాత మరుసటి ఎన్నికల్లో తన ఛాలెంజ్ నెగ్గడంతో పుట్టింటికి వచ్చిన ఆమెకు స్థానికులతో పాటు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మీ 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారని కుటుంబసభ్యులతో చాలెంజ్ చేశారు. కుటుంసభ్యులు మాత్రం కచ్చితంగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కుటుంబసభ్యులు సైతం పందెం కాశారు. ఒకవేళ తాను కాసిన పందెంలో ఓడితే పుట్టింటికి రానని, చంద్రబాబు గెలిచాకే అడుగుపెడతానని ఆమె ఛాలెంజ్ చేశారు.
2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడంతో పందెం ఓడిన విజయలక్ష్మీ గత ఐదేళ్ల నుంచి పుట్టింటికి రావడం మానేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నెగ్గడంతో ఐదేళ్ల తరువాత సొంత గ్రామం కేశవాపురానికి వచ్చారు విజయలక్ష్మీ. శపథం నెరవేరడంతో ఐదేళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన ఆమెకు గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు.విజయలక్ష్మి శపథం నెరవేరడంతో ఆమెను కుటుంబసభ్యులు ఘనంగా సత్కరించారు. గ్రామంలోకి అడుగుపెట్టిన విజయలక్ష్మీ దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం తన పుట్టింటికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఖమ్మం జిల్లాలో వైరల్ అవుతోంది. విషయం తెలిసిన కొందరు ఇదెక్కడి అభిమానం రా నాయనా అంటూ చర్చించుకుంటున్నారు.