Apsara’s Murder: పక్కా ప్లాన్ తోనే.. అప్సర హత్యలో వెలుగుచూసిన అంశాలు.

శంషాబాద్‌లో అర్చకుడి చేతిలో దారుణ హత్యకి గురైన అప్సర అసలు ఇంటినుంచి ఎలా వెళ్ళింది.? ఎక్కడెక్కడ తిరిగారు.? ఏం చేశారు.? అర్చకుడు సాయి ఆమెని హత్య చేసేందుకు ఎంతకాలంగా ప్లాన్ చేస్తున్నాడు.? ఏ ఆయుధంతో అప్సరని మట్టుబెట్టాడు.? ఇలాంటి విషయాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - June 9, 2023 / 06:44 PM IST

Apsara’s Murder: శంషాబాద్‌లో అర్చకుడి చేతిలో దారుణ హత్యకి గురైన అప్సర అసలు ఇంటినుంచి ఎలా వెళ్ళింది.? ఎక్కడెక్కడ తిరిగారు.? ఏం చేశారు.? అర్చకుడు సాయి ఆమెని హత్య చేసేందుకు ఎంతకాలంగా ప్లాన్ చేస్తున్నాడు.? ఏ ఆయుధంతో అప్సరని మట్టుబెట్టాడు.? ఇలాంటి విషయాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్సరని అర్చకుడు సాయి క్షణికావేశంలో చంపలేదని పోలీసులు తేల్చారు. పక్కా పథకం ప్రకారమే అప్సరని నమ్మించి వెంట తీసుకెళ్ళి చంపేశాడని పోలీసుల విచారణలో బయటపడింది.

కోయంబత్తూరు వెడుతున్నానని..(Apsara’s Murder)

ఈ నెల 3 వ తేదీన కోయంబత్తూరు వెడుతున్నానని అప్సర ఇంటినుంచి బయటికి వచ్చింది. ఎయిర్ పోర్టులో అర్చకుడు సాయి దింపుతాడని అప్సర తల్లికి చెప్పింది. సరూర్ నగర్‌లో అప్సరని ఫోర్టు కారులో ఎక్కించుకున్న అర్చకుడు సాయి శంషాబాద్ నుంచి రాళ్ళగూడ వైపుకి కారుని తీసుకెళ్ళాడు. అప్పటికే అర్చకుడు సాయి కారులో బెల్లం దంచే కర్రని తీసుకు వచ్చాడు. రాళ్ళగూడలో సాయి, అప్సర కలిసి భోజన చేశారు. అటు తరువాత కారు ఫ్రంట్ సీట్లో రిలాక్స్ మోడ్‌లో కూర్చున్న అప్సర తలపై బెల్లం దంచే కర్రతో కొట్టి అర్చకుడు సాయి చంపేశాడు.

రోజంతా ఇంటిముందే కారులో డెడ్ బాడీ..

అదే కారులో అప్సర శవాన్ని తీసుకుని అర్చకుడు సాయి తన ఇంటికి చేరుకున్నాడు. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటిముందే కారుని అర్చకుడు సాయి పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి సరూర్ నగర్‌లో మాన్‌హోల్‌లో పడేశాడు. తరువాత శవంపై మట్టిని వేశాడు. ఈ లోగా కూతురు కనిపించడం లేదని అప్సర తల్లి పోలీసులని ఆశ్రయించింది. దీంతో పోలీసులతో కలిసి అర్చకుడు సాయి అన్ని చోట్లా వెతికాడు. అయితే అప్సర ఇంటినుంచి బయలుదేరిన దగ్గరనుంచి సిసి కెమెరాలతోపాటు సెల్‌ఫోన్ ట్రాక్ రికార్డుని పోలీసులు పరిశీలించారు. హత్య జరిగిన మరునాడు కూడా అర్చకుడు సాయి, అప్సర సెల్‌ఫోన్లు ఒకే చోట ఉండటంతో పోలీసుల్లో అనుమానాలు బయల్దేరాయి.

పెళ్లి కోసం వేధిస్తోందనే..

సాయిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయటికి వచ్చింది. కొన్ని రోజులుగా తనకి అప్సరతో వివాహేతర సంబంధం ఉందని అర్చకుడు సాయి చెప్పాడు. పెళ్లి చేసుకోమని అప్సర వేధిస్తుండటం వల్లే చంపేశానని అర్చకుడు సాయి పోలీసులకి చెప్పాడు. వివాహేతర సంబంధం బయటపడుతుందన్న భయంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని అర్చకుడు సాయి విచారణలో వెల్లడించాడు. అప్సర కేసుని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఛేదించామని పోలీసులు తెలిపారు.