Wife Built Temple: పతినే ప్రత్యక్ష దైవంగా భావించిన భార్య భర్త చనిపోయిన తర్వాత గుడి కట్టిన సంఘటన ఆసక్తిగా మారింది .మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ,సోమ్లాతండాకు చెందిన బానోతు హరిబాబు, కల్యాణి దంపతలు. వీరికి 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది . పిల్లలు కలగ లేదు. అయినప్పటికీ భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కల్యాణిని హరిబాబుఎంతో ప్రేమ గా చూసుకునేవారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ వీరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2020 సెప్టెంబరు 9న కొవిడ్‌తో హరిబాబు మృతి చెందారు.భర్త హరిబాబు మరణించినప్పటికీ ఆమె భర్తను మరిచిపోలేదు. ఆయన జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా వుంచుకోవాలనుకుంది . తమ 23 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా పాలరాతితో భర్త విగ్రహాం చేయించి గుడిని నిర్మించింది . తమకున్న భూమిలో భర్తకు గుడి నిర్మించింది. దీని కోసం రూ.7 లక్షల వెచ్చించి రాజస్థాన్‌లో హరిబాబు పాలరాతి విగ్రహాం తయారు చేయించింది . మొత్తం గుడి కోసం రూ.30 లక్షలు ఖర్చు చేసింది. ఈ గుడిలో బంధువలతో కలిసి పూజలు నిర్వహించింది.
గతంలో కూడా..(Wife Built Temple)
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి .ఆంధ్రప్రదేశ్‌లోకూడా ఒక భార్య తన భర్త కోసం ఇలానే గుడి కట్టింది . ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె తల్లడిల్లింది. భర్త ను నిత్యం స్మరించుకోవడానికి గుడి కట్టించింది .ఆ గుడిలో భర్త పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించింది .నిత్యం పూజలు కూడా చేస్తోంది
అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఓ ఘటన జరిగింది. అక్కడ తాతకు మనవడు గుడి కట్టించాడు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం నావల్గ గ్రామానికి చెందిన మొగులప్పకు పిల్లలు లేరు. తన తమ్ముడి మనవడిని దత్తత తీసుకున్నాడు. ఆ బిడ్డను తండ్రి మాదిరి పెంచి పెద్ద చేశాడు. 2013లో మొగులప్ప కన్నుమూయడంతో మనవడు తట్టుకోలేకపోయాడు. తాత జ్ఞాపకార్థం తన సొంత భూమిలో గుడి కట్టించాడు. రూ.24 లక్షల వరకు ఖర్చు చేసి గుడి కట్టి దానిలో తన తాత విగ్రహాన్ని నెలకొల్పి నిత్యం పూజలు చేస్తున్నారు.