Harirama jogaiah: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేబట్టబోతుందనే విషయంపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్య సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ ప్రకటన చేయడం పట్ల కాపు సంక్షేమ సేన స్వాగతించిందని జోగయ్య తెలిపారు.
మంత్రి ప్రకటనను ప్రభుత్వ నిర్ణయంగా..(Harirama jogaiah)
ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయకున్నా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వ నిర్ణయంగానే భావిస్తున్నట్లు తెలిపారు. కులగణన ద్వారా బి.సి. కులస్తులు, కాపు , అగ్రవర్ణాల జనాభా లెక్కలు తెలుస్తాయని జోగయ్య అన్నారు. వారి ఆర్ధిక, సామాజిక వివరాలు కూడా అధికారికంగా బయటపడుతాయని చెప్పారు. ఈ రకంగానైనా సదరు కులాలకు జనాభా ప్రాతిపదికన సంక్షేమం దక్కటంతో పాటు, రాజకీయ పదవులు కూడా దక్కే అవకాశం ఉంటుందని హరిరామజోగయ్య వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 15న వెనుకబడిన తరగతుల కుల గణనను ప్రారంభించనుందని మంత్రి సి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బుధవారం తెలిపారు.కుల గణన కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను వినియోగిస్తామన్నారు.రాష్ట్రంలో దాదాపు 139 బీసీ కులాలు ఉన్నాయని, ఈ వర్గాల ప్రజలు తమ సంఖ్యాబలం గురించి పట్టించుకోవడం లేదని మంత్రి తెలిపారువివిధ రంగాల్లో తమ ప్రాతినిథ్యం ఏ స్థాయిలో ఉందో వెనుకబడిన తరగతుల వర్గాలకు కూడా తెలియదని దీనిని జనాభా లెక్కలు పరిష్కరిస్తాయని ఆయన అన్నారు. జనాభా గణనతో పాటు కుల గణనను ఒకేసారి నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 11న కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ తీర్మానాన్ని పంపారని చెప్పారు.