Prime9

Monsoon: చురుకుగా నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మొన్నటి వరకు వర్షాల జాడలేక ఎండలు ఠారెత్తించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోయారు. తాజాగా వాతావరణం మారిపోయింది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. నైరుతి రుతుపవనాల కదలిక, అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన ఇవ్వగా.. ఏపీలో మాత్రం భిన్నవాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పింది.

 

ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రెండు రోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. ముఖ్యంగా వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయని.. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలోని మరో పది జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని.. ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.

 

తెలంగాణలో గడిచిన రెండు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో వర్షం పడింది. అలాగే నిన్న రాత్రి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలోను రాత్రి నుంచి భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కరెంట్ స్తంభాలు, చెట్లు విరిగిపడటంతో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇక ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా… మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ చెప్పింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలైన పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఇక వచ్చే రెండు రోజులు రాజధాని అమరావతి ప్రాంతంలో దగ్గరగా ఉన్న జిల్లాలైన ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాలో పొడి వాతావరణంతో పాటు.. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar