Chegondi Harirama Jogaiah: జనసేన -టీడీపీ కూటమి మేనిఫెస్టో ఓట్లని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇచ్చే హామీలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే ఓటర్లని ఆకట్టుకుంటాయి.? ఏ ఆకర్షణతో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్న సంక్షేమానికి మించి మంచి సంక్షేమాన్ని అంద జేస్తాయి అన్నదే కీలక అంశంగా నిలుస్తుందని జోగయ్య సూచించారు.
ఈ రెండు పార్టీలు ఇవ్వబోయే హామీలు కేవలం ప్రజాకర్షక పథకాలు మాత్రమే అయి ఓటు బ్యాంకు అంశాలుగా కేవలం ఉచితాలుగా మాత్రమే ఉండకూడదని జోగయ్య హితవు పలికారు. ఓటర్ల అవసరాలు తీర్చేవిగా ఉంటూ, వారికి ప్రాధామ్యాలుగా నిలచినప్పుడే సంతృప్తి చెంది కూటమి విజయానికి తోడ్పడతాయని జోగయ్య హెచ్చరించారు. ఈ కోణంలోనే జనసేన, టీడీపీ కూటమి మేనిఫెస్టో తయారీలో సాయం చేసేందుకే కాపు సంక్షేమ సేన ఓ చిన్న ప్రయత్నం చేసిందని జోగయ్య అన్నారు.
సుమారు 200మంది కసరత్తు చేసి ప్రతిపాదనలు సమర్పించారని, ఆ ప్రతిపాదనలని గుదిగుచ్చి, వడపోసి పీపుల్స్ మేనిఫెస్టోని తయారు చేశామని జోగయ్య తెలిపారు. ఏడాదికి 75 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే 37 అంశాలని ఫైనల్ చేసి మేనిఫెస్టోని రూపొందించామని జోగయ్య అన్నారు. ఈ మేనిఫెస్టోని త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్‌కి సమర్పిస్తామని జోగయ్య ప్రకటించారు. జనసేన- తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో తాము రూపొందించిన పీపుల్స్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతిపాదనలుగా చేర్చాలని కోరతామని జోగయ్య తెలిపారు. తాము తయారు చేసిన మేనిఫెస్టో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విశ్వాసాన్ని జోగయ్య ధీమా వ్యక్తం చేశారు.