Dharmana Prasada Rao: ఏపీలో ఎన్నికల నేపధ్యంలో అనేక విషయాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ ప్రతివిమర్శలు పొడచూపుతున్నాయి .తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 న ఈ చట్టం పై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వచ్చింది తమ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తూనే ఉందన్నారు. ఇప్పుడు టీడీపీ అదే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తుందని ఆరోపించారు .
కోర్టుల్లో పెండింగ్ పిటిషన్లు..(Dharmana Prasada Rao)
దీనిపై కోర్టుల్లో పిటిషన్ లు పెండింగ్ లో ఉన్నాయని ,వాటి పై తీర్పులు వచ్చిన తర్వాత మాత్రమే అమలు గురించి ఆలోచన చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉందన్నారు . అంతవరకూ చట్టాన్ని అమలు చేయబోమని గతంలోనే స్పష్టంచేశామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని ,దీని పై టీడీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని విమర్శించారు . రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేపట్టామని ఈ సందర్భంగా తెలిపారు .వాటి గురుంచి ఎక్కడ చెప్పఁకుండా కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ రచ్చ చేస్తుందని మండి పడ్డారు . సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోందని , అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే చేస్తున్నామని చెప్పుకొచ్చారు . దీనివల్ల రికార్డులు ఎప్పటికప్పుడు ఆధునీకరించడం జరుగుతుందని వివరించారు .