Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది.మేడిగడ్డ రిజర్వాయర్‌పై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌధ ఇరిగేషన్ కార్యాలయంలోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.
సోదాల్లో పది బృందాలు..( Kaleshwaram Project)
ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మేడిగడ్డతోపాటు ఇతర రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లని అధికారులు పరిశీలించారు. పలు డాక్యుమెంట్లని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్ హరిరామ్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. ఒక బృందం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద సోదాలు నిర్వహించగా, మరో బృందం కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎండి) కార్యాలయంలో కెఎల్‌ఐపి, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పత్రాల కోసం వెతుకుతోంది. విజిలెన్స్ విభాగానికి చెందిన ఇంజనీర్లు, అధికారులతో కూడిన పది బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.