TTD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. భక్తులకు ఆన్ లైన్ ద్వారా రెండు లక్షల 25 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది.
టోకెన్ల జారీకి 94 కౌంటర్లు..(TTD)
రేపటి నుంచి పది రోజుల పాటు కేవలం టోకెన్లు ఉన్న భక్తులకే టీటీడీ అధికారులు దర్శనం కల్పించనున్నారు.భక్తుల రద్దీతో గురువారం అర్దరాత్రి నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. వీటికోసం తిరుపతిలో 9 కేంద్రాల్లో 94కౌంటర్లు ఏర్పాటు చేసారు. వీటి ద్వారా 4,23,500 టోకెన్లు జారీ చేసారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి 31 కంపార్టు మెంట్లలో స్వామి వారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతానికి స్వామి వారి దర్శనానికి సుమారు 16 గంటలు పడుతోందని అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచే ద్వార దర్శనం ఉండటంతో.. కొండంతా భక్తులతో కిటకిటలాడుతోంది. రేపటినుంచి మూడు రోజులపాటు ఆర్దిత సేవలు రద్దు చేసారు.వైకుంఠ ఏకాదశి సందర్బంగా శనివారం వేకువజామున 1.45 గంటలనుంచి స్వామి వారి దర్శనం ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.