Svims Security: తిరుపతి స్విమ్స్ లో సెక్యూరిటీ దాష్టీకం.. టీటీడీ ఉద్యోగి తండ్రి మృతి

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ సెక్యూరిటీ సిబ్బంది దాష్టీకంతో క్యాజువాల్టీ ముందే ఓ వ్యక్తి ప్రాణాలు వదలాల్సి వచ్చింది. తిరుపతికి చెందిన టీటీడీ ఉద్యోగి చంద్రానాయక్‌ తండ్రి గోపీనాయక్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనని ఆటోలో స్విమ్స్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆటోడ్రైవర్‌ సాయంతోనే క్యాజువాలిటీలోకి తీసుకెళ్లడానికి చంద్రానాయక్‌ ప్రయత్నించారు.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 06:54 PM IST

Svims Security:  తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ సెక్యూరిటీ సిబ్బంది దాష్టీకంతో క్యాజువాల్టీ ముందే ఓ వ్యక్తి ప్రాణాలు వదలాల్సి వచ్చింది. తిరుపతికి చెందిన టీటీడీ ఉద్యోగి చంద్రానాయక్‌ తండ్రి గోపీనాయక్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనని ఆటోలో స్విమ్స్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆటోడ్రైవర్‌ సాయంతోనే క్యాజువాలిటీలోకి తీసుకెళ్లడానికి చంద్రానాయక్‌ ప్రయత్నించారు. మద్యం తాగి ఉన్నాడనే కారణంతో ఆటోడ్రైవర్‌ను ఆపేశారు.

ఆటోడ్రైవర్ ను అనుమతించక.. ( Svims Security)

దీంతో చంద్రానాయక్‌ తన తండ్రి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని.. దయచేసి లోపలకు పంపాలని వేడుకున్నా సెక్యురిటీ సిబ్బంది అనుమతించలేదు. ఈ క్రమంలో ఆయనకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య దాదాపు 20 నిమిషాలపాటు వాగ్వాదం జరిగింది. ఇదంతా చూస్తున్న గోపీనాయక్‌ మరింత ఉద్వేగానికి గురై మరోసారి గుండెపోటుకు గురై మృతిచెందాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన చంద్రానాయక్‌ తన తండ్రి మరణానికి మీరే కారణమంటూ సెక్యూరిటీతో ఘర్షణకు దిగాడు. వెంటనే పక్కనే ఉన్న మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి చంద్రానాయక్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో చంద్రానాయక్‌ ముఖంపై గాయాలయ్యాయి. కానీ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం చంద్రానాయక్‌ తమపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడంటూ చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వెస్ట్‌ పోలీసులు స్విమ్స్‌ అత్యవసర విభాగానికి చేరుకుని, వివరాలు నమోదు చేసుకున్నారు. తమవారికే స్విమ్స్‌లో ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని పలువురు టీటీడీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.