Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉండనున్నాయి. రెండు రోజుల క్రితం ఇరు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలతో పాటు.. వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొంది.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నట్లు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు.. వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ వీస్తాయని.. వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, తూర్పు-పడమర ద్రోణి ఒకటి నైరుతి రాజస్థాన్, దాన్ని ఆనుకుని ఉన్న కచ్ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్ గఢ్,
ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. నిన్న దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇవాళ అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ నిన్న కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు,
తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుంది.
భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఉరుములు ఉన్న సమయంలో.. పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని పేర్కొంది. బయటకు వెళ్ళే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.