Tollywood Drugs Case: మాదాపూర్‌లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నారెడ్డి, బాలాజీ, మురళిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరినుంచి 33 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు, 72వేల ఐదు వందల రూపాయలు, రెండు కార్లు, ఐదు ఫోన్లని సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడిమల్కాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంటులో బాలాజీని పట్టుకున్నారు. బాలాజీ ఇచ్చిన సమాచారంతో మాదాపూర్ విఠల్‌రావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. సినీ ఫైనాన్షియర్ వెంటరత్నా రెడ్డి సహా గుంటూరుకు చెందిన మురళిని అరెస్టు చేశారు. వీరితో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులనూ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు బాలాజీని మాజీ నేవీ అధికారిగా పోలీసులు గుర్తించారు. కంటికి గాయం కావడంతో నేవీ నుంచి బాలాజీ వైదొలిగారు. ఆ తరువాత స్నేహితులతో కలిసి మాదాపూర్‌లోని ఫ్రెస్‌లింగ్ అపార్ట్‌మెంట్‌లో తరచూ పార్టీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ సరఫరాదారులతో బాలాజీకి పరిచయాలున్నాయని పోలీసుల విచారణలో తేలింది. వీరిసాయంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాలాజీ పలు డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడని పోలీసుల విచారణలో బయటపడింది. నైజీరియన్లతోనూ బాలాజీకి సంబంధాలున్నాయని తేలింది. బెంగళూరులోని ముగ్గురు నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొన్న బాలాజీ.. సినీ పరిశ్రమలోని కొందరికి అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
మరో నిందితుడు వెంకటరత్నారెడ్డి తరచూ వీఐపీల కోసం పార్టీలు నిర్వహించినట్లు విచారణలో బయటపడింది.గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అతను పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వెంకట్ కదలికలపై 3 నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. వెంకట్ కు డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీపై చాటింగ్ చేసినట్లు గుర్తించారు.