priest killed woman: నిత్యం పూజలు చేస్తూ భక్తిలో మునిగి తేలే అర్చకుడు ఓ మహిళని చంపేశాడు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి వివరాలివి. హైదరాబాద్ సరూర్ నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న వెంకట సాయి సూర్య కృష్ణకి ఆలయంలో పరిచయం అయిన అప్సర అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. పూజారి సాయి కృష్ణకి ఇంతకుముందే పెళ్ళై భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో తనని పెళ్ళి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేసింది.
తలపై రాయితో మోది..( priest killed woman)
అప్సరను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక.. సాయికృష్ణ ఆమెని వదిలించుకోవాలని చూశాడు. ఎప్పటికైనా అప్సరతో తలనొప్పులు తప్పవని భావించాడు. చంపేయాలని నిర్ణయించాడు. ఈక్రమంలోనే జూన్ 3వ తేదీన మాట్లాడాలంటూ.. అప్సరను సరూర్ నగర్‌కి రమ్మని చెప్పాడు. పూజారి వెంకట సాయి చెప్పినట్లే అప్సర సరూర్ నగర్ వచ్చింది. అప్పటికే అక్కడకు తన కారులో వచ్చిన పూజారి వెంకట సాయి.. అప్సరను తీసుకుని శంషాబాద్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కూడా వీళ్లిద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. ఆ క్రమంలోనే ఆమె తలపై రాయితో మోది చంపేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని కవర్‌లో పెట్టి కారులో తీసుకెళ్ళి సరూర్ నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు వెళ్ళి శంషాబాద్ ఆర్‌జిఐఏ పోలీసులకి అప్సర కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
సీసీ ఫుటేజీతో బయటపడింది..
మిస్సింగ్ కేసు కింద విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ పరిశీలించగా సరూర్ నగర్ నుంచి శంషాబాద్ వైపు పూజారి వెంకట సాయి అప్సర కారులో వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వెంకట సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అప్సరను చంపినట్లు ఒప్పుకున్నాడు.అప్సరను పూడ్చిపెట్టిన మ్యాన్ హోల్ దగ్గరకు చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకుతీశారు శవాన్ని పోస్టుమార్టానికి పంపించారు.పూజారి వెంకట సాయి అప్సర ఒకే కాలనీలో కొంత కాలంగా ఉంటున్నారు. రోజూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కొన్నాళ్లుగా ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారు. దీంతో పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయటంతోనే అప్సరను చంపినట్లు పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ చెబుతున్నాడు.