Site icon Prime9

TGSRTC: కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన బాలికకు జీవితకాలం ఉచిత బస్ పాస్ మంజూరు

TGSRTC

TGSRTC

TGSRTC: కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి జీవితాంతం బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా బస్‌పాస్‌ను అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో జన్మించిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్‌ను అందించే గత విధానాన్ని కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

బస్ స్టేషన్‌లో ప్రసవించిన మహిళ..(TGSRTC)

జూన్ 16న భద్రాచలం బస్సు ఎక్కేందుకు కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్‌కు వచ్చింది. బస్ స్టేషన్ వద్ద, ఆమె ప్రసవవేదనకు గురైంది, ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.ఇంతలో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చి స్టేషన్‌ ఆవరణలోనే ప్రసవానికి సహకరించారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ప్రసవవేదనకు గురైన గర్భిణికి సురక్షితంగా ప్రసవించేందుకు సహకరించిన కరీంనగర్ ఆర్టీసీ సిబ్బందిని యాజమాన్యం అభినందించింది. టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌తో పాటు అధికారులు వారిని సన్మానించారు.అత్యవసర పరిస్థితుల్లో గర్భిణికి ప్రసవానికి సహకరించిన సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సిబ్బంది సేవలను సజ్జనార్‌ అభినందించారు.

 

Exit mobile version