YS Sharmila: తెలంగాణలో మాట్లాడే హక్కు లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై పలు విమర్శలు చేశారు. ఈ తరుణంలో.. ఆమెను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు హైదరాబాద్ లో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్ (YS Sharmila)
తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. తనను అక్రమంగా అరెస్టు చేశారని.. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాగా ఆదివారం ఉదయం షర్మిల బస చేసిన మహబూబాబాద్ మండలం బేతోలు శివారు సోలార్ తాండా వద్ద భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల ప్లెక్సీలను చింపివేశారు. దీంతో బీఆర్ఎస్, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శంకర్ నాయక్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ – కురవి జాతీయ రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఘర్షణలు తలెత్తకుండా షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.
మహిళపై ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా?
ఓ మహిళ అని చూడకుండా.. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు క్రూరమైనదని షర్మిల అన్నారు. ఓ మహిళ నేతపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ ఘటనపై షర్మిల ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.. బీఆర్‌ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే ఇలా కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్.. తనపై కావాలనే దాడికి ప్రయత్నించాడని షర్మిల అన్నారు. శంకర్ నాయక్ ఆగడాలను ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
భూములు కబ్జా చేస్తున్నారు..
మహబూబాబాద్‌లో భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 2014లో ప్రభుత్వ భూములు 2,170 ఎకరాలు ఉంటే.. నేడు 2,100 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. మహబూబాబాద్ జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని షర్మిల అన్నారు. శంకర్‌నాయక్ అవినీతిపరుడు కాబట్టే ఆయన గురించి మాట్లాడాం.. నాపై చేసిన కామెంట్లకూ బదులిచ్చామని షర్మిల అన్నారు.