Site icon Prime9

Telangana : కామారెడ్డి ఘటన సుఖాంతం… రాజు సేఫ్… 46 గంటల తర్వాత బయటికి

young man stuck in cave safely rescued and shifted to hospital

young man stuck in cave safely rescued and shifted to hospital

Telangana : కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు గుహ లోని బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న ఘటన సుఖాంతం అయ్యింది. తాజాగా రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. దాదాపు 42 గంటల పాటు నరకయాతన అనుభవించిన రాజును రెస్క్యూ ఆపరేషన్ తో అధికారులు సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించడంతో రాజును బయటకు తీసుకురాగలిగారు. దీంతో వెంటనే రాజును అంబులెన్సులో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అధికారులతో పాటు, రాజు కుటుంబ సభ్యులు , గ్రామస్థులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రాజు కుటుంబ సభ్యులు అధికారుల కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

కాగా డిసెంబర్‌ 13వ తేదీన కామారెడ్డి రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు ఘన్‌పూర్‌ శివారులో అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన సెల్‌ఫోన్‌ కింద పడిపోవడంతో దానిని తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో అతడితో పాటు మహేష్ అనే అతని మిత్రుడు కూడా తోడుగా ఉన్నట్లు తెలుస్తుంది. మంగళవారం ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోవడంతో… మహేష్, కొందరు గ్రామస్థులు బుధవారం నాడు వరి ప్రయత్నాలు చేసి అతన్ని బయటికి తీసేందుకు యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

విషయన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో రాళ్లను తొలగించేందుకు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు నడుము కింది భాగం అంతా రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడంతో అతణ్ని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. జేసీబీలు, కంప్రెషర్లు సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ నిన్న రాజును బయటకు తీయలేకపోయారు. చీకటి పడుతుండటంతో అక్కడికి సహాయక చర్యలు నిలిపివేశారు. కాగా ఈరోజు తెల్లవారుజాము నుంచి మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగించేందుకు తీవ్రంగా శ్రహించారు. ఈ క్రమంలో బ్లాస్టింగ్ లు సైతం చేశారు. దాదాపు 42 గంటల సమయంలో సుమారు 6 సార్లు బండ్లరాళ్లను అధికారులు బ్లాస్టింగ్ చేశారు.

తొలుత రాజును రక్షించేందుకు అతడి స్నేహితుడు అశోక్‌ యత్నించారు. బండరాళ్ల వద్దకు వెళ్లి అతడిలో మనోదైర్యం నింపే ప్రయత్నాలు చేశారు. అశోక్‌ ద్వారా అధికారులు రాజుకు ద్రవ పదార్థాలను అందించారు. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రెండు రోజులుగా రాజుకోసం వారు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజును తీసేందుకు అధికారులు చేసిన కృషికి కుటుంబ సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన సుఖాంతం అవ్వడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి … గుహలో బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న యువకుడు.. 40 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

 

Exit mobile version