Site icon Prime9

JP Nadda: నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది.. జేపీ నడ్డా

What happened to Nizam will happen to KCR_JP Nadda

What happened to Nizam will happen to KCR_JP Nadda

JP Nadda:తెలంగాణ సీఎం కేసీఆర్‌ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఓరుగల్లు ప్రజలకు నమస్కారం.. ఈ గడ్డపై అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా.. అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన నడ్డా.. ఆ తర్వాత హిందీలో మాట్లాడారు.అప్పట్లో నిజాం జనసభలు పెట్టుకోవద్దని ఫర్మానా జారీ చేశాడు. అదే ఆయనకు చివరి ఫర్మానా అయింది. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా సభలు పెట్టుకోవద్దంటూ ఫర్మానాలు జారీ చేస్తున్నారు. ఈయనకు కూడా ఇదే చివరి ఫర్మానా అవుతుంది. నాటి నిజాం తరహాలోనే ప్రజలు కేసీఆర్‌ను గద్దె దింపి ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని నడ్డా వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అంధకారంలో మునిగింది. లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. కేసీఆర్‌ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు దోచుకుంది. రూ.40 వేలకోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిన కేసీఆర్‌ సర్కారు.. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.లక్షా 40వేల కోట్లు ఖర్చు చేసింది. ఇంతలా ఎందుకు పెరిగింది? అంటూ నడ్డా ప్రశ్నించారు. . తెలంగాణ ఏర్పాటు చేయాలని కాకినాడలో మొదట తీర్మానం చేసిందే బీజేపీ అన్న విషయం మరిచిపోవద్దని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా జరుపుతాం. దుబ్బాక, హుజూరాబాద్‌లలో చుక్కలు చూసిన కేసీఆర్‌కు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా చుక్కలు చూపిస్తాం. అవినీతి, తానాషాహి పాలనను బొందపెడతాం. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.

తాము ప్రజల సమస్యలు తెలుసుకొని భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర చేస్తుంటే.. సీఎం కేసీఆర్‌ తమ కార్యకర్తలపైనే దాడులు చేయించి, పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు మత చిచ్చు పెట్టి.. ఆ నెపాన్ని బీజేపీపైకి నెడుతున్నారని ఆరోపించారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎప్పటికప్పుడు నిధులు ఇస్తున్నా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌– వరంగల్‌ రోడ్డుకు రూ.2,295 కోట్లు, వరంగల్‌ బైపాస్‌ రోడ్డు కోసం రూ.550 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్, జగిత్యాల రోడ్డుకు రూ.2,174 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించారు. ఈ సభలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, తరుణ్‌ చుగ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ, మురళీధర్‌రావు, ఈటల రాజేందర్, వివేక్‌ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version
Skip to toolbar