Site icon Prime9

Vijayashanthi: బీజేపీలో ‘రాములమ్మ’ను తొక్కేస్తున్నారా?

Hyderabad: లేడీ అమితాబ్ విజయ శాంతి పాతికేళ్ల కిందటే బీజేపీలో చేరినా, ఇప్పటికీ పైకెదగలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలపలేకపోయారు. టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ సోదరిగా పిలిపించుకున్నా, అక్కడా కుదురుకోలేకపోయారు. కాంగ్రెస్ లోకి వెళ్లినా అక్కడా నిలవలేకపోయారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు బీజేపీలోకే వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని నియంత అని తీవ్రంగా ఆరోపించి, ఏడాదిన్నరలో మళ్లీ ఆయన పార్టీలోనే చేరారు. ఇక చాన్నాళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2020లో వచ్చిన మహేశ్ బాబ్ సినిమా సరిలేరు నీకెవ్వరులో మెరిశారు. అంతలోనే, ఇక పై సినిమాలు చేయనంటూ ప్రకటన చేసి ఆశ్చర్యపరిచారు.

రెండేళ్ల కిందటే, అమిత్ షా సమక్షంలోనే బీజేపీలో చేరిన విజయశాంతికి ఇప్పటికీ సరైన ప్రాధాన్యం లేదు. బీజేపీ అంటే అంతా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే సాగుతుంది. అందులోనూ ఆ పార్టీలో మొదటినుంచీ ఉన్నవారికే పార్టీ, ప్రభుత్వ పదవులు. దీంతో విజయశాంతికి ఏ పదవీ లేకపోయింది. వాస్తవానికి బీజేపీకి ముందు కాంగ్రెస్ లో ఉండగా ఆమె స్టార్ క్యాంపెయినర్. కానీ అక్కడి నుంచి వచ్చాక సరైన పాత్ర దొరకలేదు. దీంతో లోలోన రగిలిపోతున్న లేడీ సూపర్ స్టార్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో గెస్ట్‌ పాత్రకే పరిమితం అయ్యారా అన్న ప్రశ్నకు తనదైన స్టయిల్‌లో జవాబిచ్చారు విజయశాంతి. బీజేపీ వంటి క్రమశిక్షణ ఉన్న పార్టీలో అసమ్మతి బయటపడదు. ఒకటీ అరా ఉన్నప్పటికీ అంతా పార్టీలోనే తొక్కేస్తారు. అందులోనూ నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారి హయాంలో అయితే నిరసన గళం ఎత్తే అవకాశమే ఉండదు. అయితే, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల వేదికగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి విజయశాంతి ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు. అంటే, జాతీయ స్థాయి పాత్ర ఉన్న వ్యక్తి. కానీ రాష్ట్ర పార్టీ నాయకత్వం పై తీవ్రంగా దునుమాడారు. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తే అసంతృప్తి బాగా ఉన్నట్లు తెలుస్తోంది.

పైకి చెప్పకున్నా, విజయశాంతి మాటలను బట్టి చూస్తే ఆమెను రాష్ట్ర పార్టీలో అణగదొక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆమెది నిరసన కాదు. తిరుగుబాటుగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కిన తీరూ తెలుస్తోంది.

Exit mobile version