Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో అర్థరాత్రి వేళ ఓ ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ వద్ద బైరమలగూడలో నిర్మిస్తున్న ఓ నూతన ఫ్లైఓవర్ నిర్మాణంలో చిన్నపాటి అపశృతి ఏర్పడి భారీ ప్రమాదానికి కారణమయ్యింది. నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులకు గాయాలయ్యాయి. కాగా వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది.
దర్యాప్తు చేపట్టనున్నట్టు ఇంజినీర్ల బృందం(Hyderabad)
ఈ ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ దుర్ఘటనపై నేడు ఇంజినీర్ల బృందం దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న అనంతరంఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలను ఏంటనే దానిపై ఇంజినీరింగ్ నిపుణుల బృందం దర్యాప్తు చేపట్టనుంది. నాణ్యతాప్రమాణాల లోపమా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే దానిపై పరిశీలన చేపట్టనుంది.
ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన కార్మికులుగా చెబుతున్నారు. మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఒక్క సారిగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని అక్కడే ఉన్న మరికొందరు కార్మికులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.