TSPSC paper leakage: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు పై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికి నెలన్నర రోజులు అయినా సిట్ దర్యాప్తు ఎందుకు పూర్తి అవడం లేదని ప్రశ్నించింది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. సిట్ దర్యాప్తు కొంతవరకు సంతృప్తిగా ఉన్నా.. దర్యాప్తు లో వేగం లేదని అభిప్రాయపడింది. అయితే దర్యాప్తు జరుగుతున్న ప్రస్తుత దశలో ఈ కేసులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
జూన్ 5 కి వాయిదా(TSPSC paper leakage)
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తు ఇంకెంతకాలం చేస్తారని హైకోర్టు.. సిట్‌ను ఉద్దేశించి ప్రశ్నించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుడిని విచారించామని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీల్లో ఒకరి నుంచి అభిప్రాయం తీసుకోవడానికి అనుమతి ఇవ్వగలరా? అని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది.
దీనికి హైదరాబాద్ సీపీ పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగుతోందని ఏజీ సమాధానం ఇచ్చారు. ‘ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించారా? ఎంతమంది ఈ కేసులో లబ్ధి పొందారు? జూన్ 5న దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలి’ అని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పేపర్ లీకేజీ లో తదుపరి విచారణను జూన్ 5 కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.