TSPSC Chairman: ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ మేరకు పరీక్షల రద్దుపై టీఎస్ పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు.
వదంతులు నమ్మెుద్దు.. (TSPSC Chairman)
ఈ వివాదంపై టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి స్పందించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. అవకతవకలు జరిగే అవకాశమే లేదని అన్నారు. అభ్యర్ధులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. ఆ వదంతులను ఆపేందుకే.. మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం.. ఈ నేపథ్యంలో మిగతా పేపర్లూ లీక్ అయ్యాయంటూ సభ్యుల ఆందోళన.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు. సుమారు 4 గంటల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. అదే విధంగా సీఎస్ శాంతకుమారితోనూ సమావేశమయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ పరిధిలోని 30 లక్షల మంది వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ కింద దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదన్న చైర్మన్.. దురదృష్టకర పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని, పేపర్‌లు లీక్ అయ్యాయంటూ, ఎగ్జామ్‌లు రద్దు అవుతాయంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెట్టాలని తాము ఇదంతా చెప్తున్నామని ఆయన అన్నారు.
లీకేజీ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
ఆ తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే అని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి అనే నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్ ఆరేడు ఏళ్ల నుంచి పని చేస్తున్నారు.
నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్ కావడంతో ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం ఉంటుంది.
రాజశేఖర్‌రెడ్డితో పాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ హ్యాకింగ్‌కు పాల్పడ్డాడని, ఈ ఇద్దరితో పాటు మరికొందరి వల్ల ఈ లీక్ వ్యవహారమంతా నడిచిందని తెలిపారాయన.
పేపర్ లీక్ అయిన ఏఈ పరీక్షకు సంబంధించి అధికారిక నివేదిక బుధవారం వరకు తెలిసే అవకాశం ఉందన్నారు.
ఆపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాకే పరీక్ష వాయిదా వేయాలా? లేదా ఇతర నిర్ణయం తీసుకోవాల అనేది ప్రకటిస్తామని తెలిపారు.
తన కూతురు కూడా గ్రూప్-1 రాసిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అలాంటిది ఏం లేదని మీడియాకు తెలిపారు.
ప్రధాన నిందితుడు ప్రవీణ్ 103 మార్కుల వ్యవహారంపై స్పందించిన ఆయన.. అది నిజమేనని, కానీ, ప్రవీణ్ సెలక్ట్ కాలేదని, ప్రవీణ్‌కు వచ్చిన మార్కులే హయ్యెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం సీరియస్
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. దీంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు.
మరోవైపు గ్రూప్-1 పేపర్ లీక్.. గురుకుల ప్రిన్సిపల్ పరీక్లల్లోనూ అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో పురోగతి చోటు చేసుకుంది.
ఈ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేశారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. సీసీఎస్ తరపున సిట్ ఇకపై ఈ కేసు దర్యాప్తును కొనసాగించనుంది. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.