Barrelakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గా ఫేమస్ అయిన శిరీష్ అనే యువతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గేదెలు కాస్తూ ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింపజేశాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఆమె ఒక్క వీడియోతోనే ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. బర్రెలక్కకు సపోర్టుగా ప్రచారంలో పాల్గొన్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నిస్తూ కన్నీటి బర్రెలక్క పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని, తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఓట్లు చీలుతాయనే భయంతోనే తనపై రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని బర్రెలక్క వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రచారానికి లభిస్తున్న మద్దతును చూసి ఓర్వలేని వారే ఇలా దాడులకు పాల్పడున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.
కాగా ఇప్పుడు తనకు భద్రత కల్పించాలంటూ శిరీష దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని.. త్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దే అని వ్యాఖ్యానించింది. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తామంటే కుదరదని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ డిజిపి, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుని బర్రెలక్కకు ఒక గన్ మెన్ తో భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.