Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికల ఆలోచన పెట్టుకోవద్దని సీఎం కేసీఆర్ పార్టీనేతలకు చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు ఈ అంశం పై స్పష్టత ఇచ్చారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉందని, ఈ ఏడాది మొత్తం ప్రజల్లోనే ఉండాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు మరింతగా చేరువ కావాలని చెప్పారు.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సీనియర్ నేతలను ఇంచార్జీగా నియమించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో చేసిన సోదాలకు సంబంధించిన అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. దర్యాప్తు సంస్థలు సోదాలు చేసిన ప్రాంతాల్లో ధర్నాలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే అంశం పైనే దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ పార్టీ నేతలను కోరారు. ప్రస్తుతం బీజేపీతో జరుగుతున్న పోరాటం ముందు ముందు ఇంకా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి పొరపాట్లు చేయవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది.
తన కూతురిని కూడ బీజేపీలో చేరాలని అడిగారని పార్టీ సమావేశంలో కేసీఆర్ చెప్పారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి అనుకూలంగా జగన్ ఉన్నా బీజేపీ జగన్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందన్నారు సీఎం కేసీఆర్. జిల్లాకు చెందిన మంత్రులతో అభివృద్ది పై ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు టచ్ లో ఉండాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు.