Drunken Drive: మ‌ద్యం మ‌త్తులో ఎస్సైని కాలుతో తన్నిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో

Drunken Drive: కారును ఆపిన పోలీసులకు "నెల్లూరి పెద్దారెడ్డి" పేరు చెబుతూ బిల్డప్ బాబాయ్‌గా బ్రహ్మానందం ఓ సినిమాలో పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఇవాళ్టికీ ఆ బిల్డప్ కామెడీ.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటోంది. సరిగ్గా అదే తరహాలో ఈ ఘటన జరిగింది.

Drunken Drive: హైదరాబాద్ లో మద్యం మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. ఏకంగా ట్రాఫిక్ సీఐపై కాలుతో తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మోతాదుకు మించి తాగిన యువకుడు.. (Drunken Drive)

బంజారాహిల్స్‌లో ఓ యువ‌కుడు మ‌ద్యం మ‌త్తులో వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం తాగి కారు నడుపుతున్న యువకుడికి పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. గౌరవ్‌ అనే యువకుడికి బ్రీత్ అన‌లైజర్ టెస్టులో 94 పాయింట్లు న‌మోదు కావ‌డంతో ట్రాఫిక్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో మద్యం మత్తులో యువ‌కుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ రెచ్చిపోయాడు. మీకు సెక్షన్లు తెలుసా.. ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చ‌రించాడు. మరింత రెచ్చిపోయిన యువకుడు.. ఎస్సైను కాలితో త‌న్నాడు. యువకుడికి తోడు.. పక్కనే ఉన్న యువతి మరితంగా రెచ్చిపోయింది. వీడియోలు తీస్తారా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మండిపడింది. దీంతో ఈ ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్‌గా గుర్తించారు.

కామెడీని తలపించిన వీడియో..

కారును ఆపిన పోలీసులకు “నెల్లూరి పెద్దారెడ్డి” పేరు చెబుతూ బిల్డప్ బాబాయ్‌గా బ్రహ్మానందం ఓ సినిమాలో పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఇవాళ్టికీ ఆ బిల్డప్ కామెడీ.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటోంది. సరిగ్గా అదే తరహాలో ఈ ఘటన జరిగింది. నడిరోడ్డుపై ఓవర్ బిల్డప్ ఇవ్వబోయి అడ్డంగా బుక్కయ్యాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ.. రేపు కోర్టుకు వస్తే అక్కడే మాట్లాడుకుందాం అంటూ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బంజారాహిల్స్ స్టేషన్ కు తరలించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న కొందరు మారడం లేదు. కొందరు అతిగా మద్యం సేవించి.. ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డ్రంకన్ డ్రైవ్ నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. తాగి వాహనాలు నడిపి.. కుటుంబాలను ఇబ్బందుల్లో పెట్టవద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

తాగి వాహనాలు నడపకండని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు. మద్యం మత్తులో జీవితాలను చిత్తు చేసుకోవద్దని యువతకు సూచించారు.