Warangal: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం ఆందోళన రేపుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆత్మహత్యకు గల కారణం ఇదేనా.. (Warangal)
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పీజీ మెుదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి అనే అమ్మాయి పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ కు చెందిన ప్రీతి అనే అమ్మాయి.. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇక్కడ సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధిత విద్యార్ధిని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ఇది జరిగేది కాదని అక్కడి విద్యార్ధులు అంటున్నారు. సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే ఈ ఘటనకు కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఆరోగ్య పరిస్థితి విషమం.. నిమ్స్‌కు తరలింపు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం.. ప్రీతిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. సీనియర్ విద్యార్థుల వేధింపుల వల్లే.. ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పాయిజన్ తీసుకోవడంతో.. విద్యార్థిని అవయవాలు దెబ్బ తిన్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాస తీసకోవడంలో ఇబ్బంది ఉందని.. విద్యార్థినిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు అన్నారు. కాలేజీలో వేధింపులపై విచారణ కమిటీ వేస్తున్నామని యాజమాన్యం తెలిపింది.
ప్రీతి తండ్రి సంచలన వ్యాఖ్యలు..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రీతి తండ్రి స్పందించారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ప్రీతి ని సైఫ్ అనే సీనియర్ విద్యార్థి వేధించినట్లు తెలిపారు. ఇదే విషయం ప్రీతి తమకు చెప్పిందని.. తమ కూతురికి ధైర్యం చెప్పి కాలేజీకి పంపించామని పేర్కొన్నారు. ర్యాగింగ్ పై పోలీసులకు ఇది వరకే సమాచారం ఇచ్చామని.. వివరించారు. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలిసి.. వారు తమనే మందలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రీతి ఫోన్ నుంచి ఫోన్ వచ్చిందని.. తను అపాస్మాకర స్థితిలో ఉన్నట్లు తెలియగానే ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు. కరోనా సమయంలో ప్రీతి సేవలు అందించిందని.. అలాంటిది తమ కూతురు ఇలా చేస్తుందని ఊహించలేదని అన్నారు. చదువుల్లో ముందుండే తమ కూతురు.. వేధింపులు ఎక్కువ కావడం వల్లే ఇలా చేసిందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
కాలేజీలో సీనియర్ల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రీతి తమ్ముడు మీడియాకు వెల్లడించాడు. వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేధింపులకు పాల్పడిన విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.