Thatikonda Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,తనపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
జనగాన జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… తనపై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కొంతమంది లేనిపోని ఆరోపణలను చేయిస్తున్నారంటూ రాజయ్య కంటతడి పెట్టారు.
దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రావాలి(Thatikonda Rajaiah)
మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనకు యువత, మహిళల బలం ఉందని.. ఆ బలాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.
దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రాజకీయాలు చేయాలని.. తాడో పేడో తెలుసుకుందామని రాజయ్య సవాల్ విసిరారు.
అయితే ఏ సర్వే చూసిన తాను ప్రజల్లో నాయకుడిగా ముందు వరుసలో ఉన్నానన్నారు.
ఎవరెనెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో 5 వసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు.
ఎంతో ఆత్మీయంగా తాను మమత అనురాగాలు పంచిపెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానన్నారు.
తన ఆత్మ స్థైర్యాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాను మహిళల గౌరవించే వ్యక్తినని తెలిపారు.
చివరి ఊపిరి ఉన్నంతవరకు ఘన్ పూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్లని చెప్పారు.
ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల మధ్యనే చస్తానని కొలంబో విగ్రహం సాక్షిగా రాజయ్య ప్రతిభూనారు.
ప్రశ్చాత్పాపం ప్రకటించి..
కాగా.. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల రాజయ్య(Thatikonda Rajaiah) తనను లైంగికంగా వేధించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
నవ్య, రాజయ్య మధ్య బీఆర్‌ఎస్ పెద్దలు సయోధ్య కుదిర్చారు. ఆదివారం రాజయ్య నేరుగా నవ్య ఇంటికి వెళ్లారు.
ఈ సందర్భంగా రాజయ్య మహిళలకు క్షమాపణ చెప్పారు. మానసిక క్షోభకు గురిచేసుంటే క్షమించాలని కోరారు.
తెలిసి తెలియక తప్పు చేస్తే మన్నించమని తెలిపారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ప్రశ్చాత్పాపం ప్రకటించారు.
తాను తప్పుచేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
మరి ఇంతా చేసి చివరకు తనపై కుట్ర పన్నుతారని.. కూతురితో సమానమైన మహిళను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని రాజయ్య అనడం గమనార్హం.