Telangana High court: తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థినులకు ఉన్న కాలేజ్ లో ఒకే ఒక టాయిలెటా? అంటూ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా, సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో సమస్యలపై ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశాడు.
తెలంగాణ సర్కార్ పై సీరియస్(Telangana High court)
ఈ లేఖను న్యాయస్థానం సుమోటో గా స్వీకరించింది. గవర్నమెంట్ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఒక ఇంటర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులుంటే.. వారందరికీ ఒకే టాయిలెట్ ఉండటం ఏంటీ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో తక్షణమే విద్యార్థునులకు అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా సీఎస్, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
విద్యాసంస్థల్లోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నేచురల్ కాల్స్ రాకుండా టాబ్లెట్స్
కాగా, కాలేజీలో కనీస వసతులు కల్పించాలంటూ చాలా రోజుల నుంచి విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.
అయినా అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో వైపు పీరియడ్స్ సమయంలో కాలేజీకి రాలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
నేచురల్ కాల్స్ రాకుండా టాబ్లెట్స్ వాడే పరిస్థతి వచ్చిందని విద్యార్థునుల ఆవేదన చెందుతున్నారు. మధ్యాహ్న భోజనానికి అరగంట మాత్రమే విరామం ఇస్తున్నారు. ఆ సమయంలోనే భోజనం
చేయడంతో పాటు ఉన్న టాయిలెట్‌ను ఉపయోగించుకోవడానికి ఇబ్బందులు పడుతుండటం.. పరిస్థితులకు భయపడి చాలా మంది విద్యార్థినులు నెలసరి సమయంలో కాలేజీకి రావడం లేదని..
కొంతమంది నీరు కూడా తాగడం లేదని.. పరిస్థితులను వివరిస్తూ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశారు.
దీనిని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.