Site icon Prime9

Telangana Government: కుటుంబ నియంత్రణ చికిత్సలకు బ్రేక్.. తెలంగాణ సర్కార్ నిర్ణయం

Temporarily-break-family-planning-operations

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కాన్పులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. రోజుకు 10 నుంచి 15 ఆపరేషన్లు మాత్రమే చేసేలా కొత్త నిబంధన విధించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్‌ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇప్పటికే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతోపాటు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా వైద్యుల లైసెన్స్‌లను కూడా రద్దు చేసింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే బాధితులకు ఇన్ఫెక్షన్‌ ప్రమాదం పెరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఘటన పై విచారణ, పోస్టుమార్టం నివేదికల అనంతరం భవిష్యుత్తులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల, కాన్పుల నిర్వహణ పై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో ఆగస్టు 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారిలో నలుగురు మహిళలు మృతి చెందటంతో పాటు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరినీ, హైదరాబాద్‌లోని నిమ్స్‌, అపోలో ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టుతో పాటు, ఘటన పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు కుటుంబ నియంత్రణ క్యాంపులను నిలిపివేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Exit mobile version