తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన వివాదం… ఒరిజినల్ మేమే అంటూ… ఆ నేతని టార్గెట్?

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలు అని తెలుస్తుంది.

  • Written By:
  • Updated On - December 17, 2022 / 05:25 PM IST

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలు అని తెలుస్తుంది. కమిటీల్లో 108మందికి స్థానం కల్పిస్తే అందులో 54 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా ” సేవ్‌ కాంగ్రెస్‌ ” అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలం తామేనని.. పార్టీని బతికించుకునే బాధ్యత కూడా తమదేనని వ్యాఖ్యానించారు.

భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన భేటీకి ఉత్తమ్‌ కుమార్‌, దామోదర రాజనర్సింహా, మధుయాష్కి, జగ్గారెడ్డితో పలువురు సీనియర్లంతా హాజరయ్యారు. వాళ్లందరూ మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయం.. కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవడం. ఎట్ ద సేమ్ టైమ్‌ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కమిటీల్లో ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. దీంతో ఈ అసంతృప్తి విషయం అధిష్టానం వరకు వెళ్ళిందని సమాచారం అందుతుంది.

ఈ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించుకోవడం జరిగిందని తెలిపారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధిస్తున్నాయని చెప్పారు. కొంతమందిని అవమానించడానికే డీసీసీల ప్రకటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. పంచాయితీ అంతా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకి.. వలస వచ్చిన వాళ్లకు మధ్యేనని స్పష్టం చేశారు. అసలు సిసలు సీనియర్లను విస్మరించి… టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ పరిస్థితులని బట్టి చూస్తుంటే సీనియర్ నేతలు అంతా ఒక వైపు, రేవంత్ రెడ్డి ఒక వైపు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయాలను కాంగ్రెస్ అధిష్టానం ఎలా చక్కబరుస్తుందో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.