SSC Paper Leak Case: తెలంగాణలో పదోతరగతి పేపర్ లీక్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఏ1 నిందితుడిగా ఉన్నఆయన కోర్టు బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఈ వ్యవహారంలో బండి సంజయ్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు.
పదో తరగతి పేపర్ లీక్ విషయంలో తనపై నిరాధార ఆరోపణల చేశారని.. వరంగల్ సీపీ రంగనాథ్ పై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. తన హక్కుల భంగంతో పాటు ఇతర విషయాలపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు బండి సంజయ్ స్పష్టం చేశారు. అదే విధంగా తనపై చేసిన ఆరోపణలపై కూడా పోరాటం చేస్తానన్నారు.
ఈ అంశంపై బండి సంజయ్ మాట్లాడారు. వరంగల్ సీపీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగనాథ్ అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ఫోన్ ఇవ్వడం లేదని అంటున్నారని.. ముందు సీపీ ఫోన్‌కాల్ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈటల రాజేందర్ ఫోన్ అడిగే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తన ఫోన్ కేసీఆర్ దగ్గరే ఉందని.. వాళ్ల దగ్గరే తన ఫోన్ పెట్టుకుని తిరిగి తననే ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.
పేపర్ లీక్ వ్యవహారంలో సోమవారం విచారణకు రావాలని బండి సంజయ్ కు కమలాపూర్ పోలీసులు నోటీసులు అందజేశారు. మొబైల్ కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. అయితే ఈ నోటీసులపై బండి సంజయ్ తన స్టయిల్ లో రిప్లై ఇచ్చారు. ఎంపీగా ఉన్న తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తన ఫోన్ పోయిందని ఇప్పటికే ఫిర్యాదు చేశానని.. తన ఫోన్ దొరికే వరకు విచారణకు పిలవొద్దని కోరారు. ఒకవేళ పదే పదే తనకు నోటీసులు ఇస్తే లీగల్‌గా ముందుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా ఫోన్ ఆచూకీ కనుగొనాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆన్ లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. కాగా, పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీగ్ కేసులో ఏప్రిల్ 5 న బండి సంజయ్ అరెస్టు అయ్యారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో తన ఫోన్ ఎక్కడో పడిపోయినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ లో కీలక సమాచారం ఉందని తెలిపారు.
పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. అయితే దర్యాప్తులో భాగంగా బండి ఫోన్ ను అడిగితే.. ఆయన ఇవ్వడం లేదని ఇటీవల వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాచి పెడుతున్నారో తెలియడం లేదన్నారు. ఫోన్ తమకు అందితే కీలక సమాచారం బయట పడుతుందని వాళ్లకి తెలుసన్నారు. బండి సంజయ్ ఫోన్ డేటా సేకరిస్తామని సీపీ తెలిపారు. అయితే, ప్రస్తుతం తన ఫోన్ పోయిందని బండి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.