Site icon Prime9

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 6 మృతి.. మృతులంతా 25 ఏళ్ల లోపు వారే

secunderabad fire accident leads to 6 members death

secunderabad fire accident leads to 6 members death

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌ లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, కాల్‌ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి. నిత్యం రద్దీగా ఉంటే ఈ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. మంటలు క్రమంలో వ్యాప్తి చెందడంతో పొగ, అగ్నికీలలతో పెయింట్‌ డబ్బాల లాంటివి పేలడంతో కొందరు కిందికి రాలేకపోయారు. మంటల్లో దాదాపు 15 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిని  అగ్నిమాపక సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో కాపాడారు.

వీరిలో ఆరుగురిని అపస్మారక స్థితిలో బయటికి తీసుకొచ్చారు. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. కానీ.. వారిని వైద్యులు కాపాడలేకపోయారు. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రిలో ప్రమీల (22),వెన్నెల(22), శ్రావణి(22), త్రివేణి(22), శివ(22)లు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే సమయంలో అపోలో ఆసుపత్రిలో ప్రశాంత్‌ (23) కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారంతా 25 ఏళ్ల లోపు వారు కావడం మరింత శోచనీయం.

మృతులలో వెన్నెల (మర్రిపల్లి), శివ (నర్సంపేట), శ్రావణి (నర్సంపేట) వరంగల్‌ జిల్లాకు చెందిన వారు. అలాగే..  ప్రశాంత్‌ (కేసముద్రం), ప్రమీల (సురేష్‌నగర్‌) మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వారు. త్రివేణి ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవ వారు. వీరంతా బీఎం5 కార్యాలయం లోని కాల్‌ సెంటర్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో  శ్రావణ్‌, భారతమ్మ, సుధీర్‌రెడ్డి, పవన్‌, దయాకర్‌, గంగయ్య, రవిలను అగ్నిమాపక సిబ్బంది రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. వీరంతా దాదాపు 4 గంటలపాటు పొగలో చిక్కుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అగ్ని ప్రమాదాలకు గోదాములే కారణామా (Secunderabad Fire Accident) ..

ఎనిమిది అంతస్తుల ఈ భవనంలో తొలుత ఏడో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అలా మొదలైన మంటలు క్రమక్రమంగా బిల్డింగ్ లోని మిగతా అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలు ఆర్పివేయగా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో పలు బట్టల షాప్‌లు, గోడౌన్‌లు ఉన్నాయి దాంతో ఎక్కువగా మంటలు వ్యాపించినట్లు సమాచారం అందుతుంది. పైర్ ఇంజన్స్‌తో అక్కడికి చేరుకున్న సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు మొత్తం డజన్‌కి పైగా ఫైర్ ఇంజన్స్‌ని ఉపయోగించారు..

అగ్నిప్రమాదాలు జరిగిన అన్ని చోట్లా అక్రమ గోదాములే కారణంగా తెలుస్తోంది. బోయిగూడ, రూబీ హోటల్‌, డెక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంటలకు కారణం గోదామే.. ఇప్పుడు స్వప్నలోక్‌లో అగ్ని ప్రమాదం ఈ స్థాయిలో జరగడానికి కారణం గోదామే అని భావిస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్సుల్లోనూ గోదాముల నిర్వహణతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదిలో జరిగిన మొత్తం 4 అగ్ని ప్రమాదాల్లో మొత్తంగా 28 మంది మృతి చెందారు. ఈ ఘోర ఘటనలో మృతి చెందిన వారికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఘటనపై విచారణ జరుగుతుంది.
Exit mobile version