Site icon Prime9

Sankalp Satyagraha: పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్ రెడ్డి

Sankalp Satyagraha

Sankalp Satyagraha

Sankalp Satyagraha: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ నేతలు తెలిపారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ (Sankalp Satyagraha) పేరుతో కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అందులో భాగంగా గాంధీభవన్‌లో కూడా కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టారు. రాహుల్‌ గొంతును అణచివేసి కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ, మోదీ చూస్తున్నారని, అలాంటి కుట్రలను ఖచ్చితంగా తిప్పి కొడతామని నేతలు చెప్పారు.

ఆందోళనపై కార్యాచరణ(Sankalp Satyagraha)

రాహుల్‌గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకనే.. ఆయనపై అనర్హత వేటు వేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం రాహుల్‌గాంధీ తాత నెహ్రూ జైలుకు వెళ్లారన్నారు. రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టాల్సిన ఆందోళనపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ఏఐసీసీ నిర్ణయం ప్రకారం పార్టీ నేతలంతా నడుచుకుంటామన్నారు. ఒక వేళ పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తామని చెప్పారు.

అందుకే రాహుల్ పై కుట్ర

రాహుల్‌పై అనర్హత వేటు నిర్ణయం కంటతడి పెట్టించిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాహుల్‌ వదులుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘అదానీ గురించి మాట్లాడినందుకే రాహుల్‌పై కుట్ర చేశారు. పార్లమెంట్‌లో ప్రశ్నిస్తారనే భయం బీజేపీలో పెరిగింది. ఆగమేఘాల మీద పరువునష్టం కేసులో శిక్ష పడేలా చేశారు. అవసరమైతే కాంగ్రెస్‌ ఎంపీలందరూ రాజీనామా చేయాలి. రాహుల్‌పై అనర్హత వేటు ఎత్తివేసే వరకు పోరాటం చేస్తాం. ఇందిరాగాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుంది’ అని కోమటిరెడ్డి తెలిపారు. ఈ దీక్షలో రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నాల, వీహెచ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

 

Exit mobile version