Rains: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ స్థిరంగా ఉన్నట్టు వాతారణ శాఖ స్పష్టం చేసింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పింది. అదే విధంగా రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
రుతుపవనాలు ఆలస్యం(Rains)
మరో వైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. నాలుగైదు రోజులు ఆలస్యంగా వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ నెల 4 కేరళను తాకుతాయని ముందు తెలిపినా.. ఇప్పటికీ రుతుపవనాలు రాలేదు. కేరళ వైపు రుతుపవనాలు పురోగమించడానికి వాతావరణం ఇప్పుడిప్పుడే అనుకూలంగా మారుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు 2.1 కి..మీ. ఎత్తువరకు విస్తరించి ఉన్నందున ఈ నెల 7 వ తేదీ కల్లా రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది.