Hyderabad: ఎఐసిసి అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ అధ్యక్ష ఎన్నిక ఓటింగ్ సిబ్బంది పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి నియోజక్షవర్గానికి ఇద్దరికి మాత్రమే ఓటింగ్ కు అనుమతి ఉండడంతో జనగామ నుండి పొన్నాల లక్ష్మయ్య తో పాటు శ్రీనివాస్ రెడ్డి కి ఐడి కార్డు ఇచ్చింది ఎఐసిసి. మరోవైపు జనగామ నుంచి తనకు ఓటు వేసే అవకాశం ఉందని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా గాంధీ భవన్‌కు చేరుకున్నారు.
అయితే ఓటరు జాబితాలో అఖరి క్షణాల్లో శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరు చేర్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసేందుకు అనుమతించకపోవడంపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడంపై పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని పొన్నాల విమర్శించారు. పొన్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఇతరులు సముదాయించారు.
అయితే ప్రస్తుతానికి ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా ఆపేశారు. ఈ విషయంపై ఏఐసీసీ ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. ఇక, 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.