Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. జులై 2న కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా వారు తెలిపారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తే మంచి జరుగుతుందని నాడు కాంగ్రెస్ అధినేత సోనియా భావించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకపక్షం ఏం చేస్తుందో అందరికీ తెలుసునని ఆయన తెలిపారు. జనవరి 1కి ముందు, తర్వాత కూడా తాను ఇదే మాట్లాడానని.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ప్రజలతో మాట్లాడామని.. కొందరు బయటకు చెప్పగలుగుతున్నారు.. మరికొందరు చెప్పలేకపోతున్నారని ఆయన వివరించారు. పదవులొక్కటే మనుషులకు ముఖ్యం కాదని.. ప్రాంతీయ పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించే తాను ప్రాంతీయ పార్టీ పెట్టలేదన్నారు పొంగులేటి.
కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచిన జోడోయాత్ర(Ponguleti Srinivas Reddy)
భవిష్యత్తు కార్యాచరణపై ఎందరో మేధావులతో చర్చించామని.. ప్రాంతీయ పార్టీలో చేరాలని మేధావులు సూచించారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచిందని ఆయన పేర్కొన్నారు. కర్నాటక విజయం కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునేలా చేసిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు.
అలాగే సీఎం కేసీఆర్ స్కీముల పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని.. మాయాగారడీలో కేసీఆర్ సిద్ధహస్తుడని పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని పరిణామాలు పరిస్థితులను బేరీజు వేసుకుని రాహుల్ గాంధీని కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి వివరణ ఇచ్చారు. కేసీఆర్ ను గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఘర్ వాపసీ నడుస్తుండడం చాలా సంతోషకరమని రాహుల్ గాంధీ అన్నారు.