KTR : నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.

  • Written By:
  • Updated On - October 26, 2022 / 05:32 PM IST

KTR: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫ్లై ఓవర్‌తో ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్నారు. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

నాగోల్ ఫ్లై ఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్‌తో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్‌ చెప్పారు.ఎస్‌ఆర్‌డీపీ కింద 47 ప్రాజెక్టులు చేపడితే అందులో ఎల్బీ నగర్- ఉప్పల్ పరిధిలో 17 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు.మరో 16 ఫ్లై ఓవర్ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పూర్తయిన 32 పనుల్లో 15 ఫ్లై ఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ అన్నారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లు రానున్నాయని తెలిపారు. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా మరొకటి శిల్పా లే అవుట్ బ్రిడ్జి అని అన్నారు. ఈ రెండింటి పనులు పూర్తవుతున్నాయని, వీటిని కూడా డిసెంబర్‌ నాటికి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు.

నాగోల్‌ ఫ్లైఓవర్‌.. 990 మీటర్ల పొడవున ఆరు లేన్లుగా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్‌ – ఎల్బీనగర్‌ మార్గంలో వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఏర్పడనుంది. సిగ్నల్ ఫ్రీ ప్రయాణంతో ట్రాఫిక్‌ సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది.