Site icon Prime9

Rahul Gandhi: మోదీ, కేసీఆర్ లు కలిసి పనిచేస్తున్నారు.. రాహుల్ గాంధీ

Modi and KCR

Modi and KCR

Kamareddy: ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కలిసి పనిచేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు, తెలంగాణలో భారత్ జోడోయాత్ర ముగింపు సందర్బంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ వద్ద జరిగిన  సభలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి రైతు వ్యతిరేక చట్టాలు బిల్లులు ప్రవేశపెట్టినా టిఆర్ఎస్ మద్దతు ఇస్తోందన్నారు. ఇందిరా, రాజీవ్ హయాంలో దళిత, గిరిజనులకు భూములు ఇచ్చాము. వాటిని లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని మరలా వారికే ఇస్తాము. నేడు దేశంలో ఒక్క రైతు కూడ ఆనందంగా లేడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతు రుణాలను మాఫీ చేసి అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు.

తెలంగాణలో ధరణి పోర్టల్ తో ఎటువంటి లాభం లేదన్నారు. జిఎస్టీ ప్రభావంతో చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డాయి. దేశంలో యువతకు ఉపాధి కరువైంది. ప్రైవేటీకరణ ద్వారా భయాందోళన కలిగిస్తున్నారు. హింస, రక్తపాతం, రైతు చట్టాలకు వ్యతిరేకంగా తన పాదయాత్ర ఉంటుందని అన్నారు. తన పాదయాత్రలో అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం లభించిందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. తెలంగాణ గొంతు అణచివేయడం ఎవరితరం కాదన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రాణ త్యాగాలతో తెలంగాణ సాధించిన విద్యార్థులు మరోసారి ఉద్యమించాలన్నారు. మేధావులు, ఉద్యమకారులు ఎందుకు కేసీఆర్ కు లొంగిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

 

 

Exit mobile version