Site icon Prime9

KTR: ఏంతినాలో, ఏంవేసుకోవాలో డిక్టేట్ చేస్తున్నారు.. కేటీఆర్

ktr

ktr

KTR: తెలంగాణలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారనిఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్టడీ మెటీరియల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు అందించాలన్నారు. ఈ ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని విమర్శించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కృషితో సాగునీటిరంగంలో ఘననీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. తెలంగాణలో ఉన్న 46 వేల చెరువులను బాగుచేసుకుంటే దాదాపు నాగార్జున సాగర్‌ కెపాసిటీ ఉంటుందని ఉద్యమనేత కేసీఆర్‌తోపాటు జయశంకర్‌ సార్‌ చెప్పేవారని గుర్తుచేశారు.ఇప్పుడు ఆ చెరువులన్నింటినీ బాగుచేసుకోవడంతో రాష్ట్రంలో పరిస్థితి మారిందన్నారు. చెరువు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్పారు. తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రమని వెల్లడించారు. ఇంటింటికీ నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జలశక్తి మిషన్‌ చెప్పిందన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా.. ఏం తినాలి, ఏం వేసుకోవాలో డిక్టేట్‌ చేస్తున్నారని విమర్శించారు. మతం, కులం గురించి కొట్లడుకోవడం వల్లే దేశం వెనుకబడిందని ఆరోపించారు. అయితే కులమతాలను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.50 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఐటీ రంగంలో లక్షా 55 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 83 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు.

Exit mobile version