Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. వారి పాలిట లారీలే యమపాశాలుగా మారాయి. ఎందుకంటే ఈ ఘటనలు సంభవించడానికి లారీలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. మొదటి ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో జరిగింది. ఆగి ఉన్న లారీని అటుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా ఈ ప్రమాదంలో మరణించినవారు వైరా మండలం విప్పలమడక నివాసులుగా గుర్తించారు. మృతులు పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, వారి కుమారుడు 13ఏళ్ల అశ్విత్ గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న రాజేష్ కుటుంబ సమేతంగా వైరా మండలం విప్పలమడక స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. మరికాసేపట్లో ఇంటికి చేరుతామనకుటుండగా ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. దీనితో విప్పలమడకలో విషాదఛాయలు ఆవరించాయి.
మరో ఘటన జిల్లాలోని పెనుబల్లి వీఎం బంజర దగ్గర జరిగింది. బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొనగా రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. దానితో లారీల డ్రైవర్లిద్దరూ క్యాబిన్లలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. రెస్క్యూ టీం అక్కడకి చేరుకుని వారిని బయటకి తీశారు కానీ ఫలితం లేకుండా పోయింది. బయటకు తీసిన కొద్దిసేపటికే వారిద్దరూ మృతి చెందారు.
మూడో ఘటన కల్లూరు మండలం రంగంబంజరలో జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయితేజ అనే యువకుడు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.