Etala Rajendar:శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎన్ నుండి వెళ్లిన ఈటల పేరును.. కేసీఆర్ పలుసార్లు ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఇది వరకే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సైతం ఈటల పేరును అసెంబ్లీలో ప్రస్తావించారు.
సీఎం నోట ఈటల మాట.. రాజేందర్ ఏమన్నారంటే? (Etala Rajendar)
ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం కేసీఆర్ తన పేరును ప్రస్తావించడం పట్ల ఈటల రాజేందర్ స్పందించారు. డైట్ ఛార్జీల పెంపుపై ఈటల పలు సూచనలు చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. సూచనలు తీసుకోవాలని సీఎం సంబంధింత మంత్రులకు సూచించారు. ఈటలను సంప్రదించి వివరాలు తీసుకోవాలని.. అవసరమైతే కాల్ చేసి మరి వివరాలను సేకరించాలని మంత్రి హరీష్‌రావును ఆదేశించారు. దీనిపై సమావేశాల అనంతరం ఈటల మాట్లాడారు. కేసీఆర్ తన పేరు ప్రస్తావించిన మాత్రానా.. తాను పొంగిపోనని.. మెతక మాటలకు తాను పడిపోనంటూ స్పష్టం చేశారు. గతంలో జరిగిన అవమానాలను ఎప్పటికి మరిపోనని ఈటల అన్నారు. తన ఇమేజ్ ని దెబ్బతీయడానికే.. ఇలా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. పక్కన కూర్చున్నంత మాత్రానా.. పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
పార్టీలు మారే వ్యక్తిని కాదు..
సమావేశాల అనంతరం ఈటల మాట్లాడారు. అవసరాల కోసం పార్టీని మారే వ్యక్తిని కాదన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీని విడలేదని.. కావాలనే బయటకు పంపించారని ఈటల గుర్తు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చాకా.. తనను ఎలా ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకున్నారు. తనపై చేసిన దాడి.. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు మర్చిపోలేదన్నారు. తనను మానసికంగా ఎలా హింసించారో.. ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్ లోకి మళ్లీ ఆహ్వానం అందినా.. వెళ్లనని తెలిపారు. అనంతరం బడ్జెట్ సమావేశాలపై ఈటల స్పందించారు. తన 20 ఏళ్ల రాజకీయంలో ఇంత తక్కువ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరగలేదని అన్నారు.
సమావేశాలు జరిగిన తీరు బాధకరమన్నారు. కేవలం అధికార పార్టీ సభ్యులకే మాట్లాడే అవకాశం ఇచ్చారన్నారు. కేసీఆర్ చేసిన తప్పులను కవర్ చేయడానికే మోదీని తిడుతున్నారని ఆరోపించారు. అధికార ప్రజాప్రతినిధులే మాట్లాడితే.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలను మళ్లీంచేందుకే.. మోదీపై తిట్ల పురాణం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో బిల్లులు రాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించాలని ఈటల సూచించారు.
స్టేట్ బడ్జెట్ ఓ తప్పుల తడక
ముఖ్యమంత్రి, మంత్రులు సభలో చెప్పింది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈటల అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నవనేది వాస్తవమన్నారు. 2లక్షల 90వేల కోట్ల బడ్జెట్‌లో 55వేల కోట్లు నిధులు బక్వాజ్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో సగానికి పైగా లెక్కలు తప్పుల తడక అన్నారు. 2024 లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఆశీస్తున్నారు. అది జరిగే పని కాదు.. ముందు వచ్చే ఎన్నికల్లో ఆయన్ని గెలవమనండి అని సవాల్ విసిరారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. భాజపా మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని.. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. 12 వ తేదీ అయినా.. ఇంకా వారికి జీతాలు అందడం లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు చర్చించేందుకే అసెంబ్లీకి వచ్చానని వివరించారు. ప్రజా సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం పిలిస్తే వెళ్తానని ఈటల పేర్కొన్నారు.